Jana Nayagan : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో ‘జననాయగన్’ మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని రాహుల్ అన్నారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం ద్వారా కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోంది. మోదీ గారు.. తమిళ ప్రజల్ని అణచివేయాలనే మీ ప్రయత్నాలు సఫలం కావు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ గత వారం విడుదల కావాల్సిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల వాయిదా పడింది. దీనిపై కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. వచ్చేవారం దీనిపై విచారణ జరగనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే ఈ సినిమా వాయిదా పడిందని చిత్ర యూనిట్, తమిళ సినిమా వర్గాలు అంటున్నాయి. బీజేపీ కావాలనే సినిమాను ఆపే ప్రయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి.
The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.
Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.
— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026
తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ అంశంపై స్పందించారు. విజయ్ కు మద్దతుగా మాట్లాడారు. కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బీజేపీ స్పందించింది. సినిమాటోగ్రఫీ చట్టాలకు అనుగుణంగానే, నియమ నిబంధనలను అనుసరించి ఈ సినిమా వాయిదా పడిందని బీజేపీ వ్యాఖ్యానించింది.