న్యూఢిల్లీ : ఎదుగుతున్న భారత్‌ను, భారతీయులను 1970వ దశకం నుంచి తన కెమెరాలో బంధించిన దిగ్గజ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ (83) ఆదివారం కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ మెదడుకు వ్యాపించడం, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన ఢిల్లీలోని ఓ దవాఖానలో తుది శ్వాస విడిచారు. తన 23వ ఏట స్టేట్స్ వార్తాపత్రికలో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఆయన పాత్రికేయ జీవితం ప్రారంభించారు. ఆధునిక భారత్‌లో బంగ్లాదేశ్ యుద్ధం, ఆ దేశ కాందిశీకుల సమస్య(1977), భోపాల్ గ్యాస్ విషాదం(1984) లాంటి కీలక ఘట్టాలను, వారణాసి ఆధ్యాత్మిక వైభవాన్ని ఆయన తన కెమెరాలో బంధించారు. భారతావని సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక కోణాలను తన లెన్స్ ద్వారా ఫొటోలు తీశారు.
ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ తన ఫొటోల్లో సమాన ప్రాధ్యాన్యాన్ని ఆయన ఇచ్చారు. ‘మనం జీవిస్తున్న కాలాన్ని బంధించడానికి’ ఫొటోగ్రఫీ అవసరమని ఆయన నమ్మేవారు. ఆయన తీసిన ఫొటోలు పలు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. బంగ్లాదేశ్ యుద్ధాన్ని, తదనంతర పరిణామాలను ఫొటో వార్తలుగా అందించినందుకు భారత ప్రభుత్వం 1972లో ఆయనను పద్మశ్రీతో గౌరవించింది. యునెస్కో, అమెరికా ప్రభుత్వం నుంచి ఆయన ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులు అందుకున్నారు. రాయ్ పలు పుస్తకాలను రచించారు.