న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ గగన వీధుల్లో మంగళవారం రాత్రి రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పాకిస్థాన్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. పాక్ సరిహద్దు వద్ద భారతీయ వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు( Rafale jets) చక్కర్లు కొట్టినట్లు పేర్కొన్నది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత యుద్ధ విమానాలను వెనక్కి పంపినట్లు ఓ కథనంలో పాకిస్థాన్ మీడియా ప్రకటించింది. భారతీయ గగనతల సరిహద్దులోనే ఆ రఫేల్ విమానాలు పెట్రోలింగ్ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది.
పెట్రోలింగ్ నిర్వహించిన రఫేల్ విమానాలు.. లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటలేదని పాక్ మీడియా చెప్పింది. రఫేల్ కదలికల్ని తమ వైమానిక దళ విమానాలు గుర్తించినట్లు పాక్ పేర్కొన్నది. అయితే ఇండియా 24 నుంచి 36 గంటల్లో తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు పాక్ మంత్రి అతాహుల్లా తరార్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూర్టీ సమావేశం జరిగింది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు చెందిన అంశంపై ఆ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం జరగడం రెండోసారి. ఫస్ట్ సమావేశంలో సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే.