న్యూఢిల్లీ, డిసెంబర్ 3: చదువును మధ్యలోనే వదిలేసిన దాదాపు 14 లక్షల మంది భారత బాలికలు తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చేసిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఐఎస్‌ఈ-వైజ్) అవార్డు దక్కింది. ఈ అవార్డును గెలుచుకొన్న తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అవార్డు కింద ఆమెకు రూ.4 కోట్లు దక్కనున్నాయి. ఈ సందర్భంగా సఫీనా స్పందిస్తూ ‘కొన్ని సమస్యల వల్ల బాలికలు చదువుకు దూరం కావడం బాధాకరం. ఈ సమస్య నాకు కూడా ఎదురైంది. మూడేండ్లు చదువు మానేసి ఇంట్లోనే కూర్చొన్నా.
చదువు మానేసిన బాలికలను తిరిగి పాఠశాలలకు పంపేలా చూడాలని నిర్ణయించి ఓ సంస్థను స్థాపించి విజయం దిశగా పయనిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఖతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వారం దోహాలో జరిగే డబ్ల్యూఐఎస్‌ఈ 11వ సమావేశంలో ఆమెకు ఈ అవార్డును అందజేయనున్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో అన్న మాటే వినపడని సమయంలో 16 ఏండ్ల క్రితం ఎన్జోవోను స్థాపించి బాలికలకు చదువు చెప్పి వారిని ప్రధాన విద్యాస్రవంతిలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నా.
మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా చాలా గ్రామీణ ప్రాంతాల్లో మేకలు తమ ఆస్తి, ఆడపిల్లలు అప్పులుగా కొందరు తల్లిదుండ్రులు భావిస్తున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు విద్యకు దూరం కావడానికి పేదరికం నుంచి పితృస్వామ్యం వరకు అనేక కారణాలున్నాయన్నారు. తొలుత తాను ఈ సంస్థను రాజస్థాన్ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసినప్పుడు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దానిని మధ్యప్రదేశ్, బీహార్,యూపీ రాష్ర్టాలకు కూడా విస్తరించినట్టు సఫీనా తెలిపారు.