భోపాల్: పది నెలల బాబును నేలపై ఉంచిన ఒక మహిళ నీటిలోకి దూకింది. కాలువలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కధయ్యకాల గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజు అహిర్వార్, అతడి స్నేహితుడు జితేంద్ర అహిర్వార్ పొరుగున ఉన్న ఖజురియా గ్రామంలోని పొలంలో పురుగుల మందు పిచికారీ చేయడానికి గురువారం వెళ్లారు. ఆ పని తర్వాత తమ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఆ మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. దీంతో రెండు గ్రామాల మధ్య ఉన్న కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది. ఇది గమనించిన కాలువ అవతల ఉన్న స్నేహితులు బైక్పై మరో మార్గంలో రావాలని రాజు, జితేంద్రకు సూచించారు. బైక్ తాళాలు విసరగా అవి నీటిలో పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక అవతలి వైపునకు వెళ్లేందుకు పరవళ్లు తొక్కుకున్న కాలువలోకి వారిద్దరూ దిగారు.
కాగా, 30 ఏళ్ల రబీనా కంజర్, నీరు పట్టుకునేందుకు చంకలో పది నెలల బాలుడితో కలిసి ఆ కాలువ వద్ద ఉన్న పంప్ వద్దకు వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి దిగుతున్న తన గ్రామానికి చెందిన రాజును ఆమె వారించింది. అయితే లెక్కచేయని అతడు జితేంద్రతో కలిసి కాలువలోకి దిగాడు. అదుపు తప్పిన వారిద్దరూ నీళ్లలో పడి మునగసాగారు. ‘అక్కా కాపాడు’ అంటూ రాజు కేకలు వేశాడు.
అప్రమత్తమైన రబీనా తన చంకలోని బిడ్డను నేలపై కూర్చోపెట్టింది. వెంటనే కాలువలోని నీటిలోకి దూకి మునిగిపోతున్న రాజును కాపాడింది. అయితే అతడి స్నేహితుడు జితేంద్రను మాత్రం ఆమె కాపాడలేకపోయింది. కాలువలో కొట్టుకుపోయిన అతడు మరణించాడు. తర్వాత రోజున ఈతగాళ్ల సహాయంతో గాలించి జితేంద్ర మృతదేహాన్ని వెలికితీశారు.
మరోవైపు ధైర్యం చేసి నీటిలోకి దూకి మునిగిపోతున్న రాజును కాపాడిన రబీనాను పోలీసులు ప్రశంసించారు. ఆమెతోపాటు గాలింపులో సహకరించిన ఆమె సోదరుడికి కూడా క్యాష్ రివార్డును అందజేశారు. కాగా, తనకు ఈత వచ్చని, అందుకే తెలిసిన వ్యక్తి అయిన రాజును కాపాడిగలిగినట్లు రబీనా తెలిపింది. అయితే అతడి స్నేహితుడ్ని మాత్రం కాపాడలేకపోయినట్లు ఆమె చెప్పింది.