చండీగఢ్: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు కలిగి ఉండి, పాక్ గూఢచారిగా పనిచేస్తున్న పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్(41)ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. అతడికి ఐఎస్ఐతో, ఇటీవల దేశ బహిష్కరణకు గురైన పాక్ దౌత్య ఉద్యోగి డానిష్‌తో సంబంధాలున్నట్టు తెలిసిందని పంజాబ్ డీజీపీ తెలిపారు. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్(పీఐవో) షకీర్తోనూ అతడికి సంబంధం ఉందని చెప్పారు. జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ కలిసి పాక్‌లో మూడు సార్లు పర్యటించినట్టు, ఆ సమయంలో అక్కడ ఐఎస్ఐ అధికారులను కలిసినట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశాక జస్బీర్ తన ఫోన్లోని పీఐవోలతో చేసిన కమ్యూనికేషన్ వివరాలను చెరిపేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. జస్బీర్ ‘జాన్మహల్ వీడియో’ పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. అతడి చానల్‌కు 11 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.