పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించుకొని, అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత తన మద్దతుదారుడైన చన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాడు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎం అభ్యర్థిగా తన పేరు ప్రకటించకపోవడంపై అసంతృప్తి చెందినా.. దానిపై గొడవ చేసే సమయం అతనికి దక్కలేదు. సర్లే ఎన్నికల్లో గెలిచిన తర్వాత చూసుకుందాం అనుకున్నాడేమో.. ఈ విషయంపై సిద్ధూ కూడా ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు సిద్ధూకు ఊహించని షాక్ ఇచ్చారు.
కచ్చితంగా గెలుస్తారనుకున్న అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక్కడ సిద్ధూనే కాదు శిరోమళి అకాలీదళ్ నేత బిక్రమ్ మజీతియా కూడా సీనియర్ నేతనే. ఇలాంటి ఇద్దరు హేమాహేమీలను ఓడించిన జీవన్ జ్యోత్ ఎవరు? అని ఇప్పుడు నెటిజన్లు వెతుకుతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే జీవన్ జ్యోత్ ప్రజల మనిషి. సామాజిక కార్యకర్త అయిన ఆమె.. మహిళా సంక్షేమం కోసం తీవ్రమైన కృషి చేసింది. మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ విషయంలో మార్పులు రావాలని, ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడటం వల్ల చాలా నష్టాలు ఉంటాయని చెప్తూ మహిళల్లో చైతన్యం కలిగించారు.
ముఖ్యంగా పేద వారు, నిరక్షరాస్యులైన మహిళలకు ఈ విషయాలను తెలియజేసేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. ఆమెను ‘‘ప్యాడ్ వుమెన్ ఆఫ్ పంజాబ్’’ అని పిలుస్తారంటేనే ఆమె ఈ విషయంలో ఎంతటి కృషి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీతో చేతులు కలిపి.. గ్రామీణ మహిళలకు రీయూజబుల్ (మళ్లీ మళ్లీ వాడుకోగలిగిన) శానిటరీ ప్యాడ్లను అందించడంలో సఫలీకృతురాలైంది.
శ్రీ హేమకుంట్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి సమాజంలోని పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు. ఈ వర్గాల ప్రజల్లో అక్షరాస్యత పెంచడం, విద్య, ఆరోగ్యం అందించడంతోపాటు స్లమ్-రీహాబిలేషన్, వొకేషనల్ విద్య, మహిళా సాధికరత తదితర సామాజిక అంశాల్లో కృషి చేశారు. ఇన్ని చేసిన ఆమె ఎన్నికల్లో నిలబడటంతో నియోజకవర్గంలోని ప్రజలు జీవన్ జ్యోత్‌కు పట్టం కట్టారు. సిద్ధు, మజీతియాపై భారీ మెజార్టీతో ఆమెను గెలిపించారు.