చండీఘడ్: రాష్ట్రంలోని 420 మంది వీవీఐపీలకు మళ్లీ భద్రతను పునరుద్దరించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది. ప్రఖ్యాత సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ జరిగిన అయిదు రోజుల క్రితం ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పంజాబ్లో వీఐపీలకు సెక్యూర్టీని ఎత్తివేసిన మరుసటి రోజే మూసేవాలాను హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి ఓపీ సోని కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్, హర్యానా కోర్టుకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జూన్ 7వ తేదీ నుంచి 424 మంది వీఐపీలకు భద్రతను కల్పించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 6వ తేదీన నిర్వహించనున్న ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం నేపథ్యంలో వీఐపీలకు సెక్యూర్టీని ఎత్తివేశామని ఇవాళ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.