ఛండీగడ్: ఆరు నెలల్లో పంజాబ్ ఎన్నికలు రాబోతున్నాయి. 2027 ఎన్నికల్లో రైతులు, గ్రామీణ ఓటర్ల ప్రభావం పడుతుందనే కారణంతో కేంద్రం పంజాబ్ రైతులతో చర్చలు జరిపింది. గురువారం రాత్రి సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులతో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురుగ్రామ్‌లో మూడున్నర గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఇందులో 10 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు రైతు నాయకులు. పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ ఉపసంహరణ, నిరసనల్లో పాల్గొన్న రైతులపై కేసుల ఉపసంహరణ, విద్యుత్ ట్రాన్స్మీటర్లకు సంబంధించిన వాటితో పాటు మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి. శుక్రవారం జరగాల్సిన ఈ చర్చలను కేంద్రమంత్రి అభ్యర్థన మేరకు గురువారమే నిర్వహించారు. రైతుల డిమాండ్లను సంబంధిత అధికారులతో పాటు ప్రధాని నరేంద్రమోదీతో చర్చిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు కిసాన్ మోర్చా వెల్లడించింది.