గౌహతి : కుటుంబ వివాదాల కేసుల్లో న్యాయన్థానాల్లో జరిగే విచారణ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీవీ నాగరత్న అన్నారు. కేసులను వేగంగా పరిష్కరించే క్రమంలో అర్థవంతమైన, న్యాయబద్ధమైన ఫలితాలకు భంగం కలుగకూడదని ఆమె స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కుటుంబ న్యాయస్థానాల వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న జస్టిస్ నాగరత్న శనివారం గౌహతిలో జరిగిన రెండు రోజుల తూర్పు ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.
కుటుంబ వివాదాల పరిష్కారంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు, న్యాయస్థాన విచారణ మధ్య ఉన్న సవాళ్లు, భవిష్యత్ మార్గాలపై ఈ సదస్సు నిర్వహించారు. కుటుంబ వివాదాల కేసుల్లో తీర్పులు వెలువడటానికి ఆలస్యం జరుగుతున్నదని జస్టిస్ నాగరత్న అన్నారు. తీర్పుల్లో జాప్యం కారణంగా కుటుంబ సంబంధాల్లో ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ పరిష్కార విధానాలను ఉపయోగించడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించవచ్చని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.