చండీఘఢ్ : పంజాబ్లో ఇటీవల వెలుగుచూసిన ప్రార్ధనాలయాల అపవిత్ర ఘటనల నుంచి దృష్టి మరల్చేందుకు రాజకీయ కుట్రలో భాగంగా లుధియానా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే బాంబు పేలుళ్లు జరిగాయని వచ్చిన ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు.
లుధియానా బాంబు బ్లాస్ట్ కేసులో ఐఎస్ఐ పాత్రపై ఇప్పటివరకూ తనకు ఎలాంటి సమాచారం లేదని..ఇటీవల జరిగిన సిక్కు ప్రార్ధనాలయాల అపవిత్ర ఘటనలను మరుగుపరిచేందుకే రాజకీయ కుట్రలో భాగంగా పేలుళ్లకు తెగబడ్డారని ఆయన పేర్కొన్నారు. లుధియానా బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని స్పష్టం చేశారు.
లుధియానా బాంబు పేలుళ్ల ఘనటలో పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తానీ గ్రూపుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో సీఎం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఓ ప్రముఖ రాజకీయ నేతపై డ్రగ్స్ కేసు నమోదైన క్రమంలో డ్రగ్ స్మగ్లర్లు ఈ బాంబు బ్లాస్ట్ వెనుక ఉండవచ్చని సీఎం సంకేతాలు పంపారు. స్మగర్లపై ఉక్కుపాదం మోపడంతో ప్రార్ధనాలయాలను అపవిత్రం చేసిన ఘటనలకు వారు పాల్పడ్డారనే అనుమానాలను పంజాబ్ సీఎం వ్యక్తం చేశారు.