AAP MLA Arrest | చండీగఢ్: ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా పంజాబ్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. మరేల్కోట్ జిల్లాలోని అమర్‌గఢ్‌లో ఉదయం బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఎమ్మెల్యేను ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంక్‌ను మోసగించి, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆయనను అదుపులోకి తీసుకుంది.
బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.41 కోట్ల ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణతో గత ఏడాది అక్టోబర్‌లో జస్వంత్‌సింగ్ ఇంటిపై సీబీఐ దాడి చేసింది. అతని నుంచి లెక్కల్లో చూపని 16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీతో పాటు పలు పత్రాలు, మొబైల్స్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఈడీ నోటీసులు జారీ చేసింది. బహిరంగ సభలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని చూస్తే తమ పార్టీ పరువును తీయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నదని మండిపడింది.