అమరావతి: పులుస చేప..! ఇది చాలా ఖరీదైన చేప..! కేవలం వర్షాకాలంలో మాత్రమే ఈ చేప లభ్యమవుతుంది..! జూలై మొదలు సెప్టెంబర్ తొలి వారం వరకు ఈ పులస చేపలు కనిపిస్తాయి. ఈ చేపలకు విలక్షణమైన రుచి ఉంటుంది. అందుకే జనం ఈ చేపలంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ధర ఎంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతారు. కొంత మంది సీజన్‌కు కొన్ని నెలల ముందే మత్స్యకారులకు అడ్వాన్స్ చెల్లిస్తారంటే ఈ పులస చేపకు ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.
ఈ పులస చేపలు వాస్తవానికి ఉప్పు నీటి చేపలు. సముద్ర జలాల్లో పెరుగుతాయి. అయితే వర్షాకాలంలో సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఈ పులస చేపలు గోదావరి రీజియన్‌లోని నదీ జలాల్లోకి వలస వస్తాయి. వర్షాకాలం వర్షాలు పడి కొత్తనీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఈ సముద్ర చేపలు ఎదురెక్కి కొత్త నీటిలోకి చేరుకుంటాయి. గోదావరి రీజియన్‌లో సంతానోత్పత్తి సీజన్ ముగియగానే మత్స్యకారులకు చిక్కకుండా మిగిలిన పులస చేపలు కూడా చనిపోతాయి. పిల్ల చేపలేమో తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోయి.. తర్వాత సీజన్లో మళ్లీ గోదావరి రీజియన్‌లోకి వస్తాయి.
కేవలం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని సముద్ర తీరాల్లో మాత్రమే ఈ పులస చేపలు లభ్యమవుతాయి. అయితే ఒడిశా తీరంలో లభించే పులసతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే పులస ఇంకా రుచిగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో దొరికే పులసకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పులస చేప సముద్రంలో ఉన్నప్పుడు అంత రుచిగా ఏమీ ఉండదని, సముద్రంలోని ఉప్పు నీటి నుంచి స్వచ్ఛమైన నదీజలాల్లోకి వచ్చిన తర్వాత ఈ చేప రుచి మారుతుందని ఏపీ మత్స్యకారులు చెబుతున్నారు. ఏపీలో ఈ సీజన్లో మూడు నుంచి నాలుగు కేజీల బరువున్న ఒక్కో పులస చేప ధర దాదాపు రూ.20 వేలు పలుకుతున్నదని వారు తెలిపారు.
ఎందుకంత ఖరీదు..?
పులస చేపల ధరలు భారీగా ఉండటానికి ప్రధానమైన కారణం వాటికి ఉండే విలక్షణమైన రుచి. అంతేగాక ఈ చేపలు ఏడాదిలో కొంత కాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండటానికి మరో కారణంగా చెప్పవచ్చు. ఏటికేడు ఈ పులస జాతి చేపల సంఖ్య తగ్గిపోతూ లభ్యత తగ్గిపోతుండటం కూడా వీటికి డిమాండ్ పెరగడానికి ఇంకో కారణంగా భావించవచ్చు. అంతేగాక ఖరీదైన చేపలు కావడంతో మత్స్యకారులు పులస చిక్కిందంటే అది పూర్తిగా ఎదగకపోయినా పట్టుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పులస ధర భారీగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు.
అయితే ఈ పులస చేపల సంఖ్య ఏటికేడు తగ్గిపోతుండటంతో రానురాను ఇవి పూర్తిగా కనిపించకుండాపోయే ప్రమాదం ఉన్నదని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు చొరవతీసుకుని ఈ పులస చేపల సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.