పుణె: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్(Puja Khedkar) తీవ్ర వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. తన ప్రైవేటు ఆడీ కారుకు ప్రభుత్వ స్టిక్కర్‌ను అంటించుకున్నది. దానికి రెడ్ బీకన్ లైట్లను కూడా అమర్చుకున్నది. దీంతో ఆమె ఆడీ కారుపై అందరి నజర్ పడింది. ఆ తర్వాతే వివాదాస్పద పూజా ఖేద్కర్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.
ఖేద్కర్ వాడిన ఆడీ కారుపై పెండింగ్ ఛలాన్లు బోలెడు ఉన్నాయి. ఆ కారుపై 21 ట్రాఫిక్ ఉల్లంఘన ఫిర్యాదు ఉన్నట్లు పుణె ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు ఆ కారుపై ఫిర్యాదు ఉన్నాయి. 21 సార్లు రూల్స్ ఉల్లంఘించిన కేసులో సుమారు 27 వేల పెనాల్టీ కట్టాలంటూ పూజా ఖేద్కర్‌కు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మీకు చెందిన ప్రైవేటు ఆడీ కారుపై మహారాష్ట్ర గవర్నమెంట్ అని రాసిన నేమ్‌ప్లేట్ ఉందని, ముందు.. వెనుక ఆ ప్లేట్ ఉన్నట్లు పోలీసులు తన నోటీసులో తెలిపారు. రెడ్ బీకన్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఆ నోటీసులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి ఆఫీసర్లు వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేనట్లు గుర్తించారు.
ఇన్ని సార్లు ట్రాఫిక్‌ను ఉల్లంఘిస్తే, మరి పుణె పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2023 ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్.. యూపీఎస్సీ పరీక్షలో 841 ర్యాంక్ సాధించింది. ఆమె కుటుంబసభ్యులు కూడా పబ్లిక్ సర్వీస్‌లోనే ఉన్నారు. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు.
శారీరక అంగ వైకల్య క్యాటగిరీ, ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసి ఐఏఎస్ సర్వీస్ సాధించినట్టు పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై ఇటీవల కమిటీ విచారణ చేపట్టింది. వివాదాస్పద ప్రవర్తన కారణంగా బదిలీ అయిన ఖేద్కర్ గురువారం వాసిం జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.