Puja Khedkar : ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి (Trainee IAS) పూజా ఖేడ్కర్ (Puja Khedkar) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
పూజా ఖేడ్కర్ అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారని కూడా పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమె ట్రెయినింగ్‌ను నిలిపేశారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం లాంటి ఆరోపణలతో పూజా ఖేడ్కర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక ప్రటకనలో కూడా తెలిపింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కు ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లో ఆమె తనకు దృష్టి లోపం ఉన్నట్లుగా పేర్కొన్నారు. దాంతో ఆ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. పూజ ఖేడ్కర్ వ్యవహార శైలిపై కూడా ఆరోపణలు రావడంతో ఆమెను పుణె నుంచి వాసింకు బదిలీ చేశారు. ఇప్పుడు శిక్షణను నిలిపేశారు.