న్యూఢిల్లీ: బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు పెప్పర్ స్ప్రే చల్లడంతో ముగ్గురు నలుగురు గాయపడ్డారు. వారిని రామ్ మనోహర్ లోహియా దవాఖానకి తరలించారు.
అధ్వాన గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కొందరు పౌరులు ఆదివారం ఇండియా గేట్ వద్ద ఆందోళన చేశారు. అయితే అక్కడ అందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని పంపించేశారు. దాంతో వారు సీ-హెక్సాగాన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు. తర్వాత రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా, వారిని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులపై హఠాత్తుగా పెప్పర్ స్ప్రే చల్లారు. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.