శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. ఓ విదేశీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సహా 16 శాటిలైట్లను ఇది మోసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ మాట్లాడుతూ, ఈ రాకెట్‌ను నిర్దేశిత ఎత్తుకు నెట్టడానికి మూడో దశలో స్ట్రాప్-ఆన్ మోటార్స్ బలాన్ని అందిస్తున్నపుడు దీని ప్రయాణం దారి తప్పినట్లు, రాకెట్లో అంతరాయాలు ఏర్పడినట్లు గుర్తించామన్నారు. దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి సునిశిత విశ్లేషణ ప్రారంభమైందని చెప్పారు. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదని, మొత్తం 16 ఉపగ్రహాలు రోదసిలో పడిపోయాయని తెలిపారు.
ఇదిలావుండగా, ఇస్రో వర్గాల కథనం ప్రకారం, పీఎస్ఎల్వీ మిషన్ మూడో దశలో విఫలమవడం వరుసగా ఇది రెండోసారి. నిరుడు మే నెలలో చేసిన ప్రయత్నం మోటార్ ప్రెజర్ సమస్య వల్ల విజయవంతం కాలేదు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ, సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, అర్థం చేసుకుని, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి కొంత సమయం పడుతుందన్నారు. 22.5 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత సోమవారం ఉదయం 10.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు.
ఇది దూసుకెళ్తుండగా దాని వివరాలను ప్రత్యక్ష ప్రసారంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రారంభ దశలు ప్రణాళికకు అనుగుణంగానే జరిగాయి. “థర్డ్ స్టేజ్ ఇగ్నైటెడ్” అనే ప్రకటన రావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్లో బాధాకరమైన నిశ్శబ్దం తాండవించింది. ఈ మిషన్ ఖర్చు ఎంతన్నది ఇస్రో వెల్లడించలేదు. అయితే గత పీఎస్ఎల్వీ ప్రయోగాలకు రూ.250-300 కోట్లు ఇస్రో ఖర్చు పెట్టినట్టు సమాచారం.
పీఎస్ఎల్వీ సీ62 విఫలం కావడంతో 16 శాటిలైట్లను కోల్పోయాం. ఇందులో ప్రధానమైనది ఈవోఎస్-ఎన్1 లేదా అన్వేష. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీనిని డీఆర్డీవో నిర్మించింది. దీనిని భూమి మీద నుంచి 511 కి.మీ. ఎత్తులో ప్రవేశపెట్టవలసి ఉంది. ఈవోఎస్-ఎన్1 అనేది హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. భూమిపైగల మట్టి, నీరు, లోహాలు, చెట్లు, కాంక్రీట్ నిర్మాణాలు వంటివాటిపైన పడే సూర్య కాంతి పరావర్తనాల ఆధారంగా వాటిని ఏ మెటీరియల్‌తో తయారు చేశారో గుర్తించడానికి దోహదపడుతుంది. ప్రజా అవసరాలు, వ్యూహాత్మక కార్యకలాపాలకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
దీనితోపాటు దేశవిదేశాలకు చెందిన మరో 15 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ సీ62 మోసుకెళ్లింది. వీటిలో అయుఐశాట్, సీజీయూశాట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఉన్నాయి. ఆయుఐశాట్ భారత దేశపు తొలి ఇన్-ఆర్బిట్ ఫ్యూయలింగ్ శాటిలైట్. సీజీయూశాట్ను విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఇది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్. దీనిని ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్, విపత్తు నిర్వహణ కోసం డిజైన్ చేశారు.
అత్యంత విజయవంతమైన రాకెట్‌గా పీఎస్ఎల్వీకి పేరుంది. వరుసగా రెండు వైఫల్యాలు ఎదురుకావడం ఇస్రోను కలవరపరుస్తున్నది. 2025 మే 18న చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 61, తాజాగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-62 మూడో దశలోనే విఫలమయ్యాయి. గత 33 ఏండ్లలో 64 సార్లు పీఎస్ఎల్వీని ప్రయోగించగా, వాటిలో తాజా వైఫల్యం సహా 4 ప్రధాన వైఫల్యాలు ఉన్నాయి. పీఎస్ఎల్వీ సీ61ను గత ఏడాది మేలో ప్రయోగించగా, మూడో దశలో విఫలమైంది. దీంతో రాకెట్, ఈఓఎస్-09 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్లను కోల్పోవలసి వచ్చింది. అంతరిక్షం నుంచి అన్ని కాలాల్లోనూ నిఘా పెట్టేందుకు భారత్‌కు ఈఓఎస్-09 ఉపయోగపడుతుంది.