భోపాల్: బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్‌లో అన్నదాతలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవాలో ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సాత్నాలో మంత్రి ప్రతిమ బగ్రి రైతుల ఆగ్రహాన్ని గుర్తించి, వేరొక మార్గంలో ప్రయాణించారు. అయితే రైతులు ఆమెను అడ్డగించి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సాత్నా బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రైతుల దుస్థితిని ఏకరువు పెట్టారు. దీనిపై వ్యవసాయ శాఖ స్పందిస్తూ, ఎరువుల కొరత లేదని, తగిన స్థాయిలో సరఫరాలు ఉన్నాయని, పంపిణీ జరుగుతున్నదని తెలిపింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ స్పందిస్తూ, ఇది అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఓ కలెక్టర్ కాలర్ పట్టుకున్నారని, బీజేపీ ఎంపీ రైతుల దుస్థితి గురించి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కళ్లు తెరవాలని, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
మీరట్: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో నగ్న ముఠా భయాందోళనలు సృష్టిస్తున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దౌరాలా గ్రామంలో ఓ మహిళ తాను పని చేసే చోటుకు ఒంటరిగా వెళ్తుండగా, ఇద్దరు పురుషులు నగ్నంగా వచ్చి, ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె గట్టిగా అరచి, ఏదో విధంగా వారి నుంచి తప్పించుకుంది. అదే సమయంలో గ్రామస్థులు అక్కడికి చేరుకుని, దుండగుల కోసం వెతికారు. కానీ ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు.
ఈ సంఘటనతో భయపడిన బాధితురాలు వేరొక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లు ఆమె భర్త చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ, ఈ తరహా ఘటన ఇది నాలుగోదని, గతంలో జరిగిన మూడు సంఘటనల్లో బాధితులు సిగ్గు వల్ల బయటపెట్టలేదని చెప్పారు. పోలీసులు పరిసరాల్లోని పొలాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. గత శనివారం డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టారు. కానీ అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ విపిన్ టాడా చెప్పారు. అయితే, కొందరు గ్రామస్థులు మాట్లాడుతూ.. వదంతులను ప్రచారం చేస్తున్నారని, పోలీసుల పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గాంధీనగర్: దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్న వేళ బీజేపీ పాలిత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉద్యోగార్థులు మాత్రం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసన తెలిపారు. దీంతో సత్యాగ్రహ చావనీ నిరసన స్థలంగా మారింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,700 టీచర్ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి కుబేర్ దిండోర్కు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా విద్యను ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. కాగా, ఆర్ట్స్, సంగీతం, ఫిజికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులలో శాశ్వత పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరపాలని మరికొందరు నిరుద్యోగులు నిరసన తెలిపారు.
యూపీ సీఎం ఇంటి ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. అత్యాచారం కేసులో న్యాయం జరగలేదని విమర్శ
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం జరగడం లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం నోయిడాకు చెందిన ఓ మహిళ హర్యానాకు చెందిన జానపద గాయకుడు ఉత్తర్కుమార్ తనపై అత్యాచారం చేశాడని జూన్ 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హైకోర్టు సూచన మేరకు దాదాపు 25 రోజుల తర్వాత పోలీసులు కేసును నమోదు చేశారు. దీంతో ఈ కేసులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. నిందితుడి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నది. ఈక్రమంలోనే విసుగు చెందిన ఆత్మహత్యయత్నానికి పాల్పడిననట్టు తెలిపింది. కాగా, ఘటనపై స్పందించిన పోలీసులు ఆమె ఫిర్యాదు చేసిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఆ మహిళ నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు వెల్లడించారు.