న్యూఢిల్లీ, జూన్ 10: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. జమ్ముకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, యూపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక సహా వివిధ రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బెంగాల్లో బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
కశ్మీర్లో కర్ఫ్యూ
నూపుర్, జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని డొడా, కిస్త్వాడ్ తదితర జిల్లాలతో పాటు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్, బటామలూ, టెంగ్పొరా తదితర ప్రాంతాల్లో రోడ్లమీదకు వచ్చిన వందలాదిమంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను భద్రతాదళాలు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు భద్రతా దళాలపై రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి డొడా, కిస్త్వాడ్లో కర్ఫ్యూ విధించారు. భద్వ్రాహ్, కిస్త్వాడ్ జిల్లా కేంద్రం, శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
నిరసనలకు మేం పిలుపునివ్వలేదు: బుఖారి
ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు ముందు నిరసనకారులు ఆందోళనలకు దిగారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత మసీదు మెట్ల ముందు గుమిగూడారు.నూపుర్, జిందాల్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. 15-20 నిమిషాల పాటు కొనసాగిన ఈ నిరసనలు ప్రశాంత వాతావరణంలోనే జరిగినట్టు వెల్లడించారు. నిరసనలకు తాము పిలుపునివ్వలేదని జామి యా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి స్పష్టం చేశారు. ఆందోళనకారులు ఎవరో ఎవరికీ తెలియదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంజాబ్‌లోని లుధియానాతో సహా పలు ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
భాష్పవాయువు ప్రయోగం
వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలతో బీజేపీ పాలిత యూపీ దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని లక్నోతో పాటు సహారన్‌పుర్, మోరాదాబాద్, రామ్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బాధ్యుల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో కొంద రు నిరసనకారులు రాళ్లు రువ్వగా, పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లక్నో, ప్రయాగ్‌రాజ్, సహారన్‌పుర్‌లో వ్యాపారులు దుకాణాలు మూసేశారు. కాన్పూర్, ఫిరోజాబాద్, లక్నోలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సహారన్‌పుర్‌లో 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
రగిలిన రాంచీ..
నూపుర్, జిందాల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ జార్ఖండ్ రాజధాని రాంచీలోని హనుమాన్ మందిరం దగ్గర నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్తతలు మిన్నంటాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఉదయం నుంచే ఆందోళనలు జరుగుతుండటంతో నగరంలోని వేలాది దుకాణాలను మూసివేశారు. కర్ఫ్యూ విధించారు. మరోవైపు, వివాదాస్పద వ్యాఖ్యలతో మత ఘర్షణలకు కారణమైన నూపుర్, జిందాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ బీహార్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలోని నవాడా, అర్రాహ్, భోజ్‌పూర్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
రోడ్ల దిగ్బంధం
పశ్చిమబెంగాల్లోని ధూలాగఢ్, పాంచాలా, ఉలుబేరియాతో పాటు రాజధాని కోల్‌కతా.. నిరసనకారుల ప్రదర్శనలతో దద్దరిల్లాయి. హౌరా జిల్లాలోని ఫులేశ్వర్, చెంగాలి స్టేషన్లలో రైల్వే ట్రాక్‌లపై నిరసనలకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
మహిళలు సైతం..
వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నవీ ముంబై సమీపంలోని పాన్వెల్లో జరిగిన నిరసనల్లో మూడు వేల మంది పాల్గొన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది మహిళలు కూడా ఉన్నారు. నూపుర్, జిందాల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ స్థానిక తహసిల్దార్కి నిరసనకారులు వినతిపత్రం సమర్పించారు. థాణె, ఔరంగాబాద్, సోలాపూర్, నన్దుర్బార్, పర్భనీ, బీడ్, లాతూర్, భందారా, చంద్రాపూర్, పుణె తదితర జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి.