Wrestlers protest | న్యూఢిల్లీ/పాట్నా/లక్నో, మే 29: రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశానికి పతకాలు సాధించి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన చాంపియన్ ఆడబిడ్డలపై పోలీసులు దాడులు చేస్తూ నడిరోడ్డుపై ఈడ్చిపారేస్తుంటే ప్రధాని మోదీకి రాత్రి నిద్ర ఎలా పట్టిందని సూటిగా ప్రశ్నించాయి. పతకాలు సాధించినప్పుడు, వారితో ఫొటోలు దిగి.. ఇప్పుడు చాంపియన్లపైనే పోలీసుల ద్వారా దౌర్జన్యానికి ఎలా దిగారని సోమవారం నిలదీశాయి. బీజేపీ ఇచ్చే ‘బేటీ బచావో’ నినాదం ఒట్టి బోగస్ అని, కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆ స్లోగన్ అందుకొన్నారని దుయ్యబట్టాయి. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
Modi
ఓట్ల కోసమే ‘బేటీ బచావో’
బీజేపీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ‘ఇప్పుడు బీజేపీ అధికారంలోనే ఉన్నది. మన ఆడ బిడ్డలను అవమానిస్తూ, వీధుల్లో ఈడ్చిపారేస్తున్నారు’ అని కేంద్రం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లకు న్యాయం చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఆడబిడ్డలపై దౌర్జన్యాలు జరిగితే.. ప్రధాని మోదీకి రాత్రి ఎలా నిద్ర పట్టిందని జేడీయూ జాతీయాధ్యక్షుడు లలన్ సింగ్ ప్రశ్నించారు.
జంతర్‌మంతర్‌కు మళ్లీ రానివ్వం!
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు మళ్లీ ఆందోళన ప్రారంభించేందుకు అనుమతి ఉండబోదని న్యూఢిల్లీ డీసీపీ సూచనప్రాయంగా వెల్లడించారు. జంతర్‌మంతర్ కాకుండా, మరో అనువైన ప్రాంతంలో అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. రెజ్లర్ల దీక్షా శిబిరం తొలగింపు నేపథ్యంలో.. రెజ్లర్ల పోరాట స్థలి ఢిల్లీ-హర్యానా సరిహద్దుకు మారే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సాగించిన పోరాటం మాదిరిగా జరుగుతుందని తెలిపాయి. శిబిరం మార్పుపై నిర్ణయం తీసుకోలేదని, చర్చించుకొని భవిష్యత్తు ప్రణాళిక తీసుకొంటామని ఓ రెజ్లర్ పేర్కొన్నారు.
Akhilesh
ఫొటోల మార్ఫింగ్ సిగ్గుచేటు
పోలీసు వాహనాల్లో రెజ్లర్లకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన వారిపై సాక్షి మాలిక్ మండిపడ్డారు. అలా చేసే వారికి సిగ్గు లేదని, వారికి హృదయం అనేది ఉందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బస్సులో తాము ఏంజాయ్ చేస్తున్నామని, నవ్వుతున్నామని చూపించే కుట్ర చేశారని, తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు ఐటీ సెల్ చేస్తున్న ప్రయత్నం భయంకరంగా ఉన్నదని అన్నారు. ఆదివారం ర్యాలీ పేరుతో శాంతిభద్రతలను ఉల్లంఘించారని రెజ్లర్ల ఆందోళన నిర్వాహకులు, పలువురు మద్దతుదారులపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.
బస్సులోకి లాగిపడేశారు: రెజ్లర్లు
ఆదివారం ఆందోళన సందర్భంగా పోలీసులు తమను బస్సుల్లోకి లాగిపడేశారని, ఈ సందర్భంగా స్వల్ప గాయాలు అయ్యాయని ఒలింపిక్ మెడలిస్టు సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పోలీసులు వ్యహరించిన తీరును వివరించారు. ఒక్కో రెజ్లర్‌ను 20-30 మంది పోలీసులు చుట్టుముట్టారని చెప్పారు. తమ గోడును కేంద్రం వినిపించుకోవడం లేదని, అందుకే కొత్త పార్లమెంట్‌కు శాంతియుత మార్చ్ చేపట్టామని తెలిపారు.
కాల్చేస్తారా?
‘ఆందోళన చేస్తున్న తమను కాల్చిపారేయొచ్చని ఓ మాజీ పోలీసు అధికారి అంటున్నారు. సోదరా! నేను ఇక్కడే నిలబడుతాను లేదా మీ పోలీసుల తుపాకీ తూటా ఎదుర్కొనేందుకు ఎక్కడి రావాలో చెప్పండి. ప్రమాణం చేసి చెబుతున్నాను.. ఈ విషయంలో నేను వెన్ను చూపను. మీ బుల్లెట్‌ను నా గుండెల్లోకి తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాను. పోలీసులు ఇక మిగిలిన వాటిల్లో చేయాల్సింది ఇదే’
-బజరంగ్ పునియా
దేశంలో నియంతృత్వం
‘న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మాపై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఏడు గంటలు కూడా తీసుకోలేదు. అదే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌పై మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏకంగా ఏడు రోజులు తీసుకొన్నారు. దేశంలో నియంతృత్వం ప్రారంభమైందా? క్రీడాకారుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తున్నదో ప్రపంచమంతా చూస్తున్నది’
-వినేశ్ ఫోగట్
మేమేం అల్లర్లు చేయలేదు
‘మేము ఏమీ అల్లర్లకు పాల్పడలేదు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయలేదు. జంతర్‌మంతర్‌కు 10 అడుగుల దూరంలోనే బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసులు జంతర్‌మంతర్ వద్ద మా పట్ల దారుణంగా వ్యవహరించారు. బస్సుల్లోకి లాగిపడేయడంతో గాయాలయ్యాయి’
-సాక్షి మాలిక్
క్రీడాకారులతో వ్యవహరించే తీరు ఇదేనా?
కేంద్రంపై ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ఆగ్రహం
Ktr
ప్రపంచ వేదికలపై పతకాలతో భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన క్రీడాకారుల పట్ల వ్యవహరించే తీరు ఇలాగేనా అని ఆదివారం రెజ్లర్లపై పోలీసుల దాష్టీకాన్ని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన నిరసన కార్యక్రమంలో క్రీడాకారుల పట్ల అమానుషంగా
వ్యవహరించిన తీరుపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.