బెంగళూరు: ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం పెరిగింది. ఇస్రో ఊహించిన దాని కంటే మరింత ఎక్కువ కాలం ఇది సేవలందించనుంది. ల్యాండర్ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్లో ఇప్పటికీ 150 కిలోలకు పైగా ఇంధనం ఉండటమే దానికి కారణం. మొదటగా శాస్త్రవేత్తలు ఇందులో 1696.4 కిలోల ఇంధనాన్ని పొందుపరిచారు. సుమారు ఆరు నెలల పాటు పని చేసేలా దీన్ని డిజైన్ చేశారు. అయితే జూలై 14న ప్రయోగం ప్రారంభం నాటి నుంచి ఆగస్టు 17న ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయిన నాటి వరకు ఇస్రో ఊహించిన దాని కంటే తక్కువ ఇంధనం ఇందుకు ఖర్చు అయింది. దీంతో దీని జీవితకాలం మరింత కాలం పాటు పెరిగింది. చంద్రయాన్-2 ప్రయోగం సమయంలో ప్రొపల్షన్ మాడ్యూల్లో 1697 కిలోల ఇంధనం నింపారు. అందులో ఇప్పటికీ 150 కిలోలకు పైగా ఇంధనం ఉంది. ఈ కారణంగానే ప్రొపల్షన్ మాడ్యూల్ ఏడాదికి పైగా సేవలందించే అవకాశం ఉన్నట్టు ఇస్రో భావిస్తున్నది.