Allahabad High Court | ప్రయాగరాజ్, ఫిబ్రవరి 23: స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని, కేవలం గృహిణిగా ఉన్న వారి పేరిట వారి భర్తలు కొనుగోలు చేసిన ఆస్తి కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది. హిందూ భర్తలు తమ భార్యల పేరిట ఆస్తులు కొనటం సర్వసాధారణమని జస్టిస్ అరుణ్‌కుమార్ సింగ్ దేశ్వాల్ అన్నారు.
మరణించిన తన తండ్రి ఆస్తికి సహ యాజమాన్యాన్ని ప్రకటించాలని ఓ కొడుకు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం స్వతంత్రంగా ఆదాయం లేని భార్య పేరుతో కొన్న ఆస్తి ఆ కుటుంబ ఆస్తి అవుతుందని స్పష్టం చేశారు. భార్య సంపాదించిన ఆదాయంతో ఆస్తిని కొన్నట్టు రుజువు చేయకపోతే ఆ ఆస్తిని భర్త సంపాదనతో కొన్నట్టు పరిగణించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.