న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేధి, రాయ్‌బరేలి స్ధానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం స్పందించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేధి, రాయ్‌బరేలి స్ధానాల్లో ఏ స్ధానం నుంచి బరిలో దిగుతారని ప్రశ్నించగా ఒక రోజు తాను పోటీలో ఉంటానని, అయితే ఆ దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు.
తాను ఎక్కడినుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం ఇవ్వలేనని, ఈ విషయంపై తర్వాత దృష్టిసారిస్తామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. రాయ్‌బరేలి నుంచి ప్రియాంక తల్లి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అమేధి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరొందిన సంగతి తెలిసిందే. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రియాంక ప్రకటించారు.