Priyanka Gandhi | యూపీ సీఎ అభ్యర్థి తానేనన్న అర్థం వచ్చేట్లు వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. తాజాగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ ప్రశ్ననే ఇద్దరు విలేకరులు అడిగే సరికి, చిర్రెత్తి ఇలాంటి జవాబిచ్చానని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఇదే ప్రశ్నను ఇద్దరడిగారు. అందుకే నాకు చిర్రెత్తింది. ప్రస్తుతం నేను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో వున్నాను. అధికారికంగా వారే సీఎం, వీరే సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. యూపీ సీఎం అభ్యర్థిని తానేనన్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని, ఆ పనులను నిర్వర్తిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు. ఇక మీరెందుకు పోటీలోకి దిగరు? అని అడిగే లోపలే.. మధ్యలో కల్పించుకొంటూ… ‘నేను పోటీ చేస్తానో, లేదో.. ఇప్పటి వరకైతే తెలియదు. ప్రస్తుతానికైతే ఇది ప్రశ్నగానే మిగిలింది’ అని ప్రియాంక అన్నారు.
యూపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీతో సహా మరికొందరు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత.. విలేకరులు యూపీ సీఎం అభ్యర్థి ఎవరు? అని ప్రియాంకను ప్రశ్నించారు. యూపీ కాంగ్రెస్లో నా మొహమే కనిపిస్తుంది. ఇతరుల మొహం కనిపిస్తుందా మీకు? అన్నిచోట్లా నా మొహమే కనిపిస్తోంది. ఇంకేముంది? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో యూపీ సీఎం అభ్యర్థి తానే నంటూ ప్రియాంక పరోక్ష సంకేతాలిచ్చినట్లు అయ్యింది.