ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. గత ఏడు సంవత్సరాల్లో అమేథీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇద్దరూ కలిసి శనివారం అమేధీలో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక ఇద్దరూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొదలు, బీజేపీ అబద్ధాలాడుతూనే ఉందని ఆమె విమర్శించారు. బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె మండిపడ్డారు. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని, ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారని ఆమె విమర్శించారు. తాము గనక అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామని ప్రియాంక హామీ ఇచ్చారు.