బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాషాయ పార్టీని టికెట్ల రగడ వీడటం లేదు. టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టార్ బీజేపీకి రాజీనామా చేశారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తిరస్కరించానని ఆయన చెప్పారు.
మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కాషాయ పార్టీకి రాజీనామాలు చేయడంతో బీజేపీకి ఎన్నికలకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకలో బీజేపీని బలోపేతం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన సీనియర్ నేతలకు కాషాయ పార్టీ మొండిచేయి చూపడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే అన్నారు.
జగదీష్ షెట్టార్నే కాకుండా శేఖర్, లక్ష్మణ్ సవది వంటి నేతలనూ బీజేపీ హైకమాండ్ విస్మరించిందని దుయ్యబట్టారు. యడియూరప్పను సైతం బీజేపీ అగ్రనేతలు పక్కనపెట్టారని ఆరోపించారు. దక్షణాది అంతటికీ సుపరిచిత బీజేపీ నేత యడియూరప్పను బీజేపీ విస్మరించడం బాధాకరమని అన్నారు. బీజేపీ సీనియర్ నేతలంతా ఇప్పుడు ఉనికి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More