Bangladesh Political Crisis : బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంపై కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల విధానంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ ప్రాంతానికి భారత్ పెద్దన్నలా వ్యవహరించేందని, ఏ దేశంలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా సాయం కోసం భారత్ వైపు చూసేవారని దురదృష్టవశాత్తూ ఇప్పుడు చైనా ప్రాబల్యం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యం ఫలితమేనని ఖర్గే పేర్కొన్నారు.
కాగా, పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు సహా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) వివరిస్తున్నారు. ఈ సందర్భంగా జైశంకర్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మూడు కీలక ప్రశ్నల్ని సంధించారు.
ఢాకాలో ప్రభుత్వ మార్పిడితో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా..? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి బదులిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తద్వారా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇక షేక్ హసీనాను గద్దె దింపేందుకు గత కొన్ని వారాలుగా ఢాకాలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. ప్రత్యేకించి పాకిస్థాన్ ప్రమేయం ఏమైనా ఉందా..? అని రాహుల్ ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని మంత్రి బదులిచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు మద్దతుగా తన ప్రొఫైల్ పిక్‌ను నిరంతరం మారుస్తున్నారని తెలిపారు.
Read More :