న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వాణిజ్యలోటును పూడ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశాల నుంచి ప్రైవేట్ జెట్స్ దిగుమతిని నిలిపివేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. డిసెంబర్ 6నాటి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దస్ర్తాన్ని బ్లూమ్స్బర్గ్ బయటపెట్టింది. 15వేల కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న, అత్యవసరం కాని టర్బో జెట్ల దిగుమతిని నిలిపేయాలని కేంద్ర నిర్ణయించింది.
ఎగుమతులను పెంచి, అనవసరమైన దిగుమతులను తగ్గిస్తూ వాణిజ్య లోటును పూడ్చుకొనే మార్గాలను కేంద్రం గుర్తిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఇందుకోసం వ్యూహాలను రచించేందుకు ఏవియేషన్ రెగ్యులేటర్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీని సంప్రదించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, ఈ నిర్ణయంపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ స్పందించలేదు.