డెహ్రాడూన్: విజయదశమి వేడుకల సందర్భంగా జైలులో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. వానర సైన్యంలో భాగంగా కోతులు వేషం వేసిన ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. నిచ్చెనలు ఎక్కి జైలు గోడ దూకి పారిపోయారు. (Prisoners Escape) ఈ విషయం తెలుసుకుని జైలు అధికారులు షాక్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ సంఘటన జరిగింది. దసరా నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హరిద్వార్ జైలులోని కొందరు ఖైదీలు రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. రావణుడిపై రాముడి విజయానికి సహాయంగా ఉన్న వానర సైన్యం పాత్రల్లో కొందరు ఖైదీలు నటించారు.
కాగా, జైలు అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులంతా రామ్‌లీలా నాటకాన్ని చూడటంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో కోతుల వేషం వేసిన ఇద్దరు ఖైదీలు మెల్లగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైలు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న చోట ఉన్న నిచ్చెనల ద్వారా గోడ దూకి పారిపోయారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్న విషయాన్ని చాలా ఆలస్యంగా జైలు అధికారులు గుర్తించారు. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రమోద్, కిడ్నాప్, దోపిడీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ పారిపోయినట్లు తెలుసుకున్నారు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.