Prisoners hanged | హత్యకేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఖైదీలు జైలులోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో జరిగింది. వివరాల్లోకి వెళితే… సుల్తాన్పూర్ జిల్లా జైలు కొత్వాలి నగర్లోని గభాడియా సమీపంలోనున్నది. బుధవారం మధ్యాహ్నం జైలులో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందారు.
విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ జస్జిత్ కౌర్, ఎస్పీ సోమెన్ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్లను జైలుకు రప్పించి తనిఖీలు చేశారు. అయితే సంఘటన జరిగినప్పటి నుంచి జైలు సూపరింటెండెంట్ ఫోన్ సిచ్ఛాఫ్లో ఉంది. పంచనామా చేసి మృతదేహాలను పోర్టుమార్టం కోసం పంపినట్లు సిటీ కొత్వాల్ రామ్ ఆశిష్ ఉపాధ్యాయ్ తెలిపారు. మృతులు అమేథీ జిల్లాకు చెందిన వారిగా సమాచారం. అయితే, ఖైదీల మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.