Constitution | న్యూఢిల్లీ: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికలో రాసిన ఆర్టికల్ చర్చనీయాంశంగా మారింది. ఏడు దశాబ్దాల కిందట 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంతో దీర్ఘకాలం కొనసాగలేమని అందులో అభిప్రాయపడ్డారు. అనేకసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని చెప్పారు.
ప్రజాస్వామ్య అవసరాలతో నిమిత్తం లేకుండా.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని 1973లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, ఈ తీర్పు కొత్తదానికి కాదని పేర్కొన్నారు. ప్రస్తుత భారత రాజ్యాంగం వలస వారసత్వానికి చెందినదిగా వివేక్ దెబ్రాయ్ అభివర్ణించారు. కాగా, వివేక్ దెబ్రాయ్ రాసిన ఆర్టికల్‌కు తమ కౌన్సిల్‌కి సంబంధం లేదని ఈఏసీ-పీఎం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రధాన మంత్రికి ఆర్థిక పరమైన అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఈఏసీ’ ఓ స్వతంత్ర సంస్థ.