‘దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం పెను ముప్పుగా మారింది. మేము అధికారం లోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తాం’.. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. మోదీ ఇచ్చిన అన్ని హామీల్లాగే ఇది కూడా జుమ్లాగానే మిగిలి పోయింది. రూ. 15 లక్షలు జమ చేసేమాట దేవుడెరుగు.. ఎన్డీయే పాలనలో స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నుల డబ్బు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నది. స్విస్ నేషనల్ బ్యాంకు (ఎస్ఎన్బీ) తాజా గణాంకాలే దీనికి రుజువు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలోనే కాదు.. ఆ నల్లధనం పెరుగుదలను కట్టడి చేయడంలోనూ కేంద్రంలోని ఎన్డీయే సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా.. గత ఏడాది స్విస్ ఖాతాల్లోని భారతీయుల సంపద ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఈ మేరకు స్విస్ నేషనల్ బ్యాంకు (ఎస్ఎన్బీ) తాజా గణాంకాల్లో వెల్లడైంది.
దేశంలోని రాజకీయ పెద్దలు, కార్పొరేట్లు స్విస్ ఖాతాల్లో జమ చేస్తున్న డిపాజిట్లు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఎస్ఎన్బీ తాజా గణాంకాల ప్రకారం.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 2024లో మూడు రెట్లు పెరిగి సుమారు రూ.37,718 కోట్ల (3.5 బిలియన్ స్విస్లు)కు చేరింది. 2021 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2023లో స్విస్ ఖాతాల్లో భారతీయుల డబ్బు రూ. 9,800 కోట్లుగా ఉన్నట్టు నిరుడు ఎస్ఎన్బీ ఓ నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాలను బట్టి ఏడాదిలోనే నల్లధనం మూడు రెట్లు పెరిగినట్టు అర్థమవుతున్నది.
2021లో స్విస్ ఖాతాల్లో భారతీయుల డబ్బు రూ. 30 వేల కోట్ల వరకూ ఉన్నది. ఆ మరుసటి ఏడాది కూడా దాదాపుగా ఇంతే డబ్బు కొనసాగింది. అయితే, 2023లో ఇది ఏకంగా రూ. 20 వేల కోట్ల మేరకు తగ్గి రూ. 9,800 కోట్లకు పడిపోయింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఖర్చుల కోసం రాజకీయ పెద్దలు, కార్పొరేట్లు ఒక్కసారిగా స్విస్ బ్యాంకుల నుంచి డబ్బును ఉపసంహరించుకున్నారనే అనుమానాలు అప్పట్లో పెద్దయెత్తున వచ్చాయి. ఈ కారణంగానే 2023లో 70 శాతం మేర నిల్వలు తగ్గిపోయాయన్న వాదనలు వినిపించాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. ఎన్నికల అనంతరం తిరిగి స్విస్ ఖాతాల్లో నిల్వలు నాలుగేండ్ల గరిష్ఠానికి చేరడం గమనార్హం.
మోదీ ప్రభుత్వ హయాంలో నల్లధనం ర్యాంకుల్లో భారత్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. స్విస్ బ్యాంక్ డిపాజిట్లలో 2015లో భారత్ ర్యాంకు 75గా ఉండగా.. ప్రస్తుతం 48కు చేరింది. అంటే ఎన్డీయే పాలనలో నల్లధనం సూచీలో భారత్ ర్యాంకు 27 స్థానాలు ఎగబాకింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్విస్ బ్యాంకుల్లో భారత డిపాజిట్లు అమాంతం పెరిగాయని దీన్నిబట్టి స్పష్టమవుతున్నది. కాగా సంపన్న కుటుంబాలు, కార్పొరేట్లు తమ ఆస్తులను బినామీల ద్వారా డిపాజిట్ చేసుకుని రక్షించుకోవడానికి స్విట్జర్లాండ్లోని ట్రస్ట్ చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని స్విస్ నల్లధనంగా పరిగణించదు. అయితే, బయటి దేశాలు మాత్రం ఈ సొమ్మును చట్టబద్ధమైనదిగా గుర్తించవు.
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకొన్న నల్లధనం కేవలం రూ. 37,700 కోట్లేనా అనే అనుమానం అందరికీ రావొచ్చు. అయితే, ఈ డబ్బు భారతీయుల గుర్తింపు పత్రాల ఆధారంగా జమ చేసిన మొత్తాలు మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు. డొల్ల కంపెనీలు, బినామీ పేర్లతో జమ చేసిన భారతీయుల నల్లధనం మొత్తం దాదాపు రూ. 2,115 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల సంఘం సైతం ఇవే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగానే 2014 ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి దేశ ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానని మోదీ చెప్పినట్టు పలువురు గుర్తు చేస్తున్నారు. ఊరూ-పేరూ లేని ఈ ఖాతాలు ఏ దేశానికి చెందినవో వివరాలు తెలియకపోవడంతో స్విస్ నేషనల్ బ్యాంకు గణాంకాలను బహిర్గతపర్చట్లేదని, మొత్తం డబ్బు లక్షల కోట్లలోనే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.