న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ప్రాంతం, భాష పరంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చీల్చాలనుకొంటున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు ఆ పార్టీ తల్లి వంటిదని అన్నారు. బీజేపీ జాతీయ సదస్సు సందర్భంగా ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘వికసిత్ భారత్’ కోసం విపక్షాల వద్ద రోడ్‌మ్యాప్ లేదని, దాన్ని బీజేపీ మాత్రమే సాధించగలదని పేర్కొన్నారు. తనను దూషించడం, తప్పుడు ఆరోపణలు చేయడమనే ఒకేఒక్క అజెండాతో కాంగ్రెస్ పనిచేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు. వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ.. రానున్న 100 రోజులు చాలా కీలకమైనవని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాగా, అత్యవసర సమయాల్లో పార్టీ అధ్యక్ష పదవీ కాలం, పొడగింపుపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అప్పగిస్తూ బీజేపీ జాతీయ సదస్సు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రవేశపెట్టారు.