Petrol Pumps: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు తెరుచుకుంటున్నాయి. దాంతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 90 శాతం పెట్రోల్ బంకులు తెరుచుకోగా.. ఆయిల్ ట్యాంకర్ల రాక ఆలస్యం కారణంగా మరో 10 శాతం పంపులు మూసే ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా అన్ని పెట్రోల్ పంపులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు. దాంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతనే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఏఐఎంటీసీ సమ్మె విరమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రక్ డ్రైవర్లకు పిలుపునిచ్చింది.
అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్ చైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ పేర్కొన్నారు. అంతకుముందు ‘హిట్ అండ్ రన్’ కేసులకు కఠిన శిక్షలు ప్రతిపాదించడంపై ట్రక్కు డ్రైవర్లు భగ్గుమన్నారు. మూడు రోజుల సమ్మెలో భాగంగా మంగళవారం రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సమ్మెలో భాగంగా డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడింది. దాంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వాహనదారులు ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ పోయించుకొనేందుకు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దాంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
జమ్ముకశ్మీర్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల్లో డ్రైవర్లు ఆందోళనలు చేపట్టారు. ఇంధన డిపోల నుంచి బంకులకు ఆయిల్‌ను సరఫరా చేసే వేలాది మంది డ్రైవర్లు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. యాక్సిడెంట్ కేసుల్లో తాము 10 ఏండ్లు జైలు పాలైతే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ కుటుంబాలను ఎవరు పోషిస్తారని డ్రైవర్లు ఈ సందర్భంగా ప్రశ్నించారు. యాక్సిడెంట్ కేసులో శిక్షను ప్రస్తుత చట్టంలో ఉన్న 10 ఏండ్ల నుంచి 1-2 ఏండ్లకు తగ్గించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిల్లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలోని నిబంధల ప్రకారం.. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లు, ర్యాష్ డ్రైవింగ్ వంటివి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 106లో రెండు క్లాజులు ఉన్నాయి. ర్యాష్ లేదా నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ఒక వ్యక్తి మరణానికి కారణమై ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇస్తే గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉన్నదని 106(1) మొదటి క్లాజ్ చెబుతున్నది. 106(2) ప్రకారం నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ఒక వ్యక్తి మరణానికి కారణమై ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే గరిష్ఠంగా పదేండ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా పడుతుంది. ప్రస్తుతం హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు ఐపీసీ సెక్షన్ 304ఏ కింద ఉన్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే గరిష్ఠంగా రెండేండ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. శిక్షతో పాటు జరిమానా లేదా రెండు పడే చాన్స్ కూడా ఉన్నది. కాగా కొత్త చట్టం ప్రకారం యాక్సిడెంట్‌పై పోలీసులకు సమాచారం అందించిన, బాధితుడిని సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లిన డ్రైవర్లు కఠిన నిబంధనల కింద విచారణ ఎదుర్కోబోరని నిపుణులు చెబుతున్నారు.