న్యూఢిల్లీ: ఏవియేషన్ అకాడమీ కిడ్జానియా ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటన, అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదం మధ్య పోలికలు ఉన్నాయి. ఫాదర్స్ డే వీకెండ్ ఈవెంట్‌ను ప్రమోట్ చేయడం కోసం గురువారం ఉదయం ‘మిడ్-డే’ పత్రిక తొలి పేజీలో ఈ ప్రకటనను ముద్రించారు. అదే రోజు మధ్యాహ్నం ఎయిరిండియా ఏఐ-171 విమానం అహ్మదాబాద్‌లోని ఓ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలిపోయింది. కిడ్జానియా ప్రకటనలో కూడా ఎయిరిండియా విమానం కిడ్జానియా భవనం నుంచి దూసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సారూప్యత ఉండటంతో చాలా మంది అవాక్కయ్యారు. దీనిపై కిడ్జానియా స్పందించింది.
ఎయిరిండియాతో గత ఏడాది కుదుర్చుకున్న అవగాహన మేరకు ఈ డిజైన్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తమ సెంటర్లలో ఇటువంటి డిజైన్లు ఉంటాయని, ఆయా దేశాల్లోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌తో తాము అవగాహన కుదుర్చుకుంటామని చెప్పింది. విమాన ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపింది. తాము ఈ ప్రకటనను ఈ ప్రమాదం జరగడానికి ముందే జారీ చేశామని వివరించింది. ఈ విజువల్ ప్రదర్శనకు విరామం ఇస్తామని పేర్కొంది. కిడ్జానియా ఏవియేషన్ అకాడమీ సెంటర్లు ఢిల్లీ, ముంబై, నోయిడాలో ఉన్నాయి. వీటిలో 4-16 సంవత్సరాల మధ్య వయసుగల బాలల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.