Black Gram | మినప్పప్పును మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో వడలు, గారెలు, ఇడ్లీలు, దోశలు చేస్తుంటారు. అయితే మనం వాడే మినప్పప్పుకు పొట్టు ఉండదు. పొట్టు లేకుండా ఉపయోగిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మినప్పప్పును కాదు, మినుములను ఉపయోగించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మినుములకు పొట్టు ఉంటుంది. అందువల్ల వాటిని వాటితే ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. మినుముల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మినుముల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల మరమ్మత్తులకు, కణజాల వృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. అందువల్ల మినుములను తింటే కండరాలకు శక్తి లభిస్తుంది. దీంతో దేహం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటారు.
శారీరక శ్రమ చేసేవారు లేదా వ్యాయామం చేసేవారు మినుములను తింటుంటే దేహం ఉక్కులా తయారవుతుంది. ఎంతో బలంగా మారుతారు. చక్కని దేహాకృతి సైతం సొంతమవుతుంది. మినుముల పొట్టులో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక మినుములను పొట్టుతో సహా తింటే రక్తం వృద్ది చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. మినుముల పొట్టులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మినుముల్లో ఉండే ఐరన్ శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీంతో కణాలకు శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. మినుముల్లో ఉండే పిండి పదార్థాలు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉదయం వీటిని తింటే రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. చురుగ్గా ఉంటారు.
మినుముల్లో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు మినుములను తరచూ తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. మినుముల్లో ఉండే మెగ్నిషియం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. దీంతో మూడ్ మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు. ఉత్సాహంగా మారుతారు. మినుముల్లో అధికంగా ఉండే ప్రోటీన్లు, ఐరన్ వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. శిరోజాలు దృఢంగా మారి ఆరోగ్యంగా పెరుగుతాయి. చర్మ, జుట్టు సమస్యలు తగ్గుతాయి.
మినుములను రోజువారి ఆహారంలో సులభంగా తీసుకోవచ్చు. కానీ పొట్టుతో తింటేనే లాభాలు కలుగుతాయి. మినుములను రాత్రి పూట ఒక గుప్పెడు మోతాదులో తీసుకుని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని కాస్త ఉడికించి తినాలి. రుచి కోసం కాస్త నిమ్మరసం, నల్ల ఉప్పు, మిరియాల పొడి వంటివి చల్లి తినవచ్చు. ఉదయం కుదరకపోతే సాయంత్రం తినవచ్చు. మీరు రోజూ వాడే ఇడ్లీ, దోశ పిండిలో సాధారణ తెల్ల మినప్పప్పుకు బదులుగా పొట్టుతో ఉన్న మినప్పప్పు లేదా మినుములను వాడండి. దీంతోనూ అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మినుములతో కూర కూడా చేసుకుని తినవచ్చు. అయితే మినుములను మనం సరిగ్గా జీర్ణం చేసుకోవాలంటే వాటిని కచ్చితంగా కొన్ని గంటల పాటు నానబెట్టిన తరువాతే తినాల్సి ఉంటుంది. లేదంటే అవి కొందరికి సరిగ్గా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఇలా మినుములను తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.