Manipur | ఇంఫాల్, ఫిబ్రవరి 11: గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. ఇప్పటికే సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని బీరేన్ను కోరారు.
అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ పంపిన నివేదికలో మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరినట్టు తెలిసింది. సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నది.