న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరులో చారిత్రక దృష్టాంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆమె గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య, అత్యంత అమానవీయమైనదని వ్యాఖ్యానించారు. దీనికి భారత దేశం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉక్కు సంకల్పం, దృఢ నిశ్చయంతో స్పందించిందన్నారు.
దేశ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉంటాయని ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించిందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన దేశమంతా ఐకమత్యంతో స్పందించిందన్నారు. మనల్ని విభజించాలని కోరుకునే వారికి ఇది దీటైన సమాధానమని చెప్పారు. మనం ముందుగా దాడి చేయబోమని, మన ప్రజల రక్షణ కోసం ప్రతీకార దాడి చేయడానికి వెనుకాడబోమని ప్రపంచం గుర్తించిందని తెలిపారు.