భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనమైన ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి కలుగాలని ఆకాంక్షించారు.
కాగా, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 17 మందికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం నుంచి కేవలం నలుగురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తరలించామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు.