న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో స్వాతంత్య్రానంతరం ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల ప్రజలందరికీ సమాన హక్కులు లభిస్తాయని, మహిళల అణచివేతకు తెర పడుతుందని చెప్పారు. సామాజిక సమానత్వం ప్రాముఖ్యతను రుజువు చేస్తూ, సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ఈ చట్టం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.