Rahul Gandhi | ఎన్నికల వేళ పార్టీ కోసం పని చేయని నేతలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో స్వల్ప సీట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేయని వారంతా కౌరవులేనని, వారి జాబితా సిద్ధం చేయాలని పీసీసీ నాయకత్వాన్ని ఆదేశించారు.
పార్టీలో కొందరు నేతలు ఏసీ రూమ్‌ల్లో కూర్చుని మాట్లాడటం, ఉపన్యాసాలివ్వడం చేస్తుంటారని, మరికొందరు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తుంటారని రాహుల్ గాంధీ అన్నారు. ఏసీ రూమ్‌ల్లో ఉంటూ ఉపన్యాసాలిచ్చే నేతలు కౌరవులతో సమానం అని, వారిని బీజేపీ లాగేసుకుంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పంచ పాండవులు మాత్రమేనన్నారు. 2017 ఎన్నికల్లో కేవలం ఏడు సీట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ సీబీఐ, ఈడీ, పోలీసులు, మీడియాను ప్రతిరోజూ ఉపయోగిస్తుందని రాహుల్ ధ్వజమెత్తారు. అటువంటి నేతలకు గుజరాత్ ప్రజలు సత్యాన్ని ప్రబోధిస్తారని జోస్యం చెప్పారు. గుజరాతీలు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు రాహుల్ హితవు చెప్పారు.