న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి! నరేంద్ర మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఆదివారం కాని, సోమవారం కాని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు ఆమెకు అమిత్ షా వివరించినట్టు సమాచారం. ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న మాట వినిపిస్తున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మానవ వనరుల శాఖకి మారుస్తారని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిలను ఇంటికి పంపొచ్చని తెలిసింది.
ఇటీవలే కొత్తగా ఆరుగురు ఎంపీలను ఠాక్రే వర్గం నుంచి తెచ్చిన శివసేన(షిండే)కు బహుమతిగా ఎంపీ శ్రీకాంత్ షిండేకు మంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రి పదవిని కట్టబెడతారు.మరోవైపు మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ (రామాయణం సీరియల్లో రాముని పాత్రధారి)ను మంత్రివర్గంలో చేర్చుకుంటారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి, యూపీ నేత పంకజ్ చౌదరిని మంత్రివర్గం నుంచి తప్పించవచ్చు. ఆప్ నుంచి వచ్చిన నేతల్లో రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్ (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ)లో ఒకరికి స్థానం కల్పించవచ్చు.
ఈసారి దాదాపు 25 నుంచి 30 మంది వరకు మంత్రులపై ప్రభావం చూపేలా పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 8 నుంచి 10 మంది మంత్రులకు ఉద్వాసన, 5 నుంచి ఏడుగురు సహాయ మంత్రులకు కేబినెట్ హోదా లేదా కీలక శాఖలతో పదోన్నతి, 10 నుంచి 15 మంతి కొత్తవారికి అవకాశం, మరో 10 నుంచి 15 మంది మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. తెలంగాణకు చెందిన బండి సంజయ్‌ను మంత్రి పదవిలో కొనసాగిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థ్ధకమే.
ఇటీవలే ఆయన కుమారుడు పోక్సొ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్నారు. దీంతో బండిని పదవి నుంచి తప్పించాలని ఆయన వైరి వర్గం డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ నుంచి ఒక్క మంత్రి పదవి కోసం ఈటల రాజేందర్, లక్ష్మణ్, అరవింద్, డీకే అరుణ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రివర్గ గరిష్ఠ సంఖ్య 81 కావడంతో కొత్తగా పలువురికి అవకాశం కల్పించవచ్చు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు బీజేపీ సంస్థాగత పదవుల్లోనూ విస్తృతంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం యూపీలో ప్రకటించిన బీజేపీ కార్యవర్గంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్య ంగా యువత, ఓబీసీలకు విస్తరణలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సమాజ్‌వాది పార్టీ పీడీఏ (వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలు) నినాదాన్ని దీటుగా ఎదుర్కోవడం కోసమే యూపీ బీజేపీలో విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ జాతీయ వ్యవస్థాపక బృందం కూడా ఇదే సూత్రాన్ని అనుసరించడానికి నిర్ణయించుకుందని, దీనిలో భాగంగా యువత, మహిళలు, ఇతర సామాజిక వర్గాలకు అధికంగా ప్రాతినిధ్యం కల్పించడానికి పార్టీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇటీవల మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, అతడిని రాజ్యసభకు రీ నామినేట్ చేయలేదు. ఇదే తరహాలో త్వరలోనే పలువురు నేతలను సాగనంపుతారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.