మీరట్, జూలై 14: ఉత్తరాదిలో ఏటా జరిగే కన్వర్ యాత్రకు ఈసారి మీరట్ వినూత్నంగా సిద్ధమవుతున్నది. హరిద్వార్ నుంచి పవిత్ర గంగజలాలను కలశాలతో తీసుకువచ్చే కన్వర్‌యాత్ర కోసం ఈసారి బుల్డోజర్ ఆకారంలో వాహనం తయారు చేస్తున్నారు. హిందూ, ముస్లిం కుటుంబాలు తయారీలో పాలుపంచుకుంటుండటం విశేషం. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఐక్యతాగీతం వినిపిస్తున్నారు. మీరట్‌లోని సదర్ ప్రాంతానికి చెందిన హిందూ, ముస్లిం కుటుంబాలు పదేండ్లుగా కలిసి కన్వర్లు తయారుచేస్తున్నాయి. 15 అడుగుల పొడవు, 75 కిలోల బరువుతో రూ.45 వేల వ్యయంతో కన్వర్ రూపొందిస్తున్నాయి. గంగానది జలాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కలశాలను హరిద్వార్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి జలాన్ని తీసుకొచ్చి స్థానిక శివాలయాల్లో అభిషేకిస్తారు. ఈ యాత్ర ఏటా శ్రావణమాసంలో 15 రోజులు కొనసాగుతుంది. ఈ ఏడాది యాత్ర గురువారం నుంచి మొదలైంది.