న్యూఢిల్లీ: గర్భిణులు పారసిటమాల్ వాడితే వారి పిల్లలకు ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ వంటి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. అసెటమినోఫిన్గా పిలిచే ఈ మందులను గర్భంతో ఉన్నప్పుడు తలనొప్పి, జ్వరం, నొప్పులను తగ్గించుకోవడానికి సురక్షితమని భావిస్తారు. అమెరికాలో గల మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వివిధ దేశాలకు చెందిన లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్న 46 అధ్యయనాలను విశ్లేషించి తాజా విషయాన్ని వెల్లడించారు. పారాసిటమాల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నందున.. ప్రమాదంలో స్వల్ప పెరుగుదల కూడా ప్రజారోగ్యానికి పెద్ద చిక్కులను కలిగించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
మావి అవరోధాన్ని దాటే సామర్థ్యం గలదిగా పేరున్న పారాసిటమాల్ ఆక్సీకరణ ఒత్తిడిని ప్రేరేపిస్తుందని, హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుందని, ఎపిజెనిటిక్(జన్యు పరివర్తన ఫలితంగా గమనించదగ్గ లక్షణాలు) మార్పులకు కారణమవుతుందని.. ఇది పిండం మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని పరిశోధకులు తెలిపారు. పారాసిటమాల్ వాడకం నాడీ అభివృద్ధి లోపాలకు కారణమని తమ అధ్యయనం చూపించలేకపోయినా.. అందుకు సంబంధించిన అంశాలను బలపరుస్తున్నదని వారు చెప్పారు.