పట్నా, మే 28: బీహార్‌లోని దవాఖానలో ఓ గర్భిణి (25) మరణించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడ విధ్వంసానికి దిగారు. దవాఖానలోని ఓ నర్సును మొదటి అంతస్తు నుంచి తోసేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి ఘటన ఆదివారం రాత్రి నలంద జిల్లా బీహార్ షరీఫ్ స్టేషన్ రోడ్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సు పూనమ్ కుమారి (35) పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను మరో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిసింది. మూకదాడి నుంచి తప్పించుకునే క్రమంలో నర్సు పూనమ్ కుమారి మొదటి అంతస్తు నుంచి దూకేసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వాదనను నర్సు భర్త జై కుమార్ ప్రసాద్ ఖండించారు. దాడికి తెగబడ్డవారే తన భార్యను తోసేశారని ఆరోపించారు.