Walking for Ambulance | బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లికి పునర్జన్మే.. తొమ్మిది నెలలు నిండాక వచ్చే పురిటి నొప్పులు భరించడం వశం కాని పని.. వెంటనే 108 ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. అందులో వైద్యారోగ్య సిబ్బంది కూడా ఉంటారు. అంబులెన్స్ వెళుతుండగానే గర్భిణికి అవసరమైన ఇంజెక్షన్లు ఇస్తారు. ఉపశమన చర్యలు ఉంటాయి. కానీ జార్ఖండ్‌లో పరిస్థితులు విభిన్నం. 22 ఏండ్ల యువతి నిండు గర్భిణి. పురిటి నొప్పులతో అల్లాడిపోతున్నా.. సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి అంబులెన్స్ కావాలంటే ఏడు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. గురువారం రాత్రి హాజారీబాగ్ జిల్లాలోని ఇచాక్ బ్లాక్‌లోని దారిధాధార్ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పూర్తిగా కొండలపై ఉన్న ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పురాన్ పునియా, గోర్దిహ్, సాలియామా, ధోంగ్రీ గ్రామాల్లో 15 వేల మంది జీవిస్తున్నారు.
ఆ పంచాయతీ నుంచి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడెర్మా లోక్ సభ స్థానం పరిధిలో ఉంటుందీ ఈ కుగ్రామం. బీజేపీ మద్దతుతో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే అమిత్ కుమార్ యాదవ్.. బర్కథ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతే కాదు కొండలపై ఉంటుంది. సుదీర్ఘ కాలంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ కోసం స్థానికులు పోరాడుతున్నారు.
గురువారం రాత్రి మున్నీ దేవి అనే గర్భిణీ తొమ్మిది నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. కొండలపై ఉన్న ఈ పల్లెకు అంబులెన్స్ రాలేదు. ఈ పల్లెకు ఏడు కిలోమీటర్ల దూరంలోని ప్రధాన రహదారిపై అంబులెన్స్ వేచి ఉంది. ఇక చేసేదేమీ లేక మున్నీ దేవి భర్త సురేంద్ర కిష్కు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని కచ్చా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు. ఈ సంగతి తెలిసిన స్థానికులు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. సరైన రోడ్డు నిర్మించాలని తాము ఎంత ఆందోళన చేసినా పట్టించుకునే వారే లేరని స్థానికులు వాపోతున్నారు.