న్యూఢిల్లీ: పెళ్లి కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టపూర్వకంగా శారీరిక సంబంధం ఉంటే, దాని ఆధారంగా ఆ వ్యక్తుల క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించలేమని సుప్రీంకోర్టు(Supreme Court) చెప్పింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఓ అమ్మాయితో రిలేషన్ కొనసాగించి, ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే ఆమెను విడిచిపెట్టినట్లు నమోదు అయిన కేసులో సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. అయితే కానిస్టేబుల్‌గా నియమితుడైన తిరుపతి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కనపెట్టింది. జస్టిస్ మన్మోహన్, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసులో తాజాగా ఓ తీర్పును వెలువరించింది.
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో తిరుపతి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కానీ అతనిపై 2014లో క్రిమినల్ కేసు రిజిస్టర్ కావడంతో అతనికి రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాన్ని నిలిపివేసింది. తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లి పేరుతో శృంగారం చేసి, చివరకు పెళ్లి చేసుకోలేదన్న ఆరోపణలు ఆ వ్యక్తిపై నమోదు అయ్యాయి. వాస్తవానికి ఈ కేసును 2015 లోక్ అదాలత్‌లో సెటిల్ చేశారు. కానీ తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగం ఇవ్వకపోవడంతో అతను సుప్రీంను ఆశ్రయించాడు.
పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు తమ ఇష్ట ప్రకారమే శారీరక సంబంధాన్ని ఏర్పర్చుకోవడాన్ని తప్పుగా చూడలేమని, ఆ రిలేషన్ వల్ల వారి క్యారెక్టర్‌పై ముద్ర వేయలేమని సుప్రీం ధర్మాసనం తాజా తీర్పులో చెప్పింది. సమ్మతితో సంభోగించే వారికి వ్యతిరేకంగా ఏ చట్టంలేదని కోర్టు పేర్కొన్నది. ప్రతి రిలేషన్ పెళ్లికి దారి తీయదని, సామాజిక స్థితిగతులను సున్నితం భావంతో అధికారులు చూడాలని కోర్టు తెలిపింది. ప్రతి సంబంధం పెళ్లికి దారి తీయదు కాబట్టి, ఈ కేసులో మోసం జరిగినట్లుగా రుజువు కాదని కోర్టు తీర్పునిచ్చింది.