Prashant Tamang : ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్-3 విన్నర్ ప్రశాంత్ తమాంగ్ (43) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీ, జనక్ పురిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం కన్నుమూశారని అతడి స్నేహితుడు, సింగర్ మహేశ్ సేవా వెల్లడించారు. ప్రశాంత్ సింగర్ గానే కాకుండా, నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1983లో డార్జిలింగ్ లో జన్మించిన ప్రశాంత్.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు.
తర్వాత పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందాడు. కోల్ కతాలో పని చేస్తూనే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, గాయకుడిగా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో 2007లో వచ్చిన ఇండియన్ ఐడల్-3 అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. దీంతో గాయకుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సింగర్ గా రాణించాడు. సినిమాలతోపాటు ప్రైవేటు ఆల్బమ్స్ కూడా పాడాడు. ఇండియాతోపాటు నేపాల్ సినిమాల్లోనూ నటించాడు. ఇండియాలో పాతాళ లోక్ సీజన్2లో కనిపించాడు. త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ లో కూడా నటించాడు.
నేపాలీ గోర్ఖా సంతతికి చెందిన ప్రశాంత్ సక్సెస్ ను నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. ప్రశాంత్ తమాంగ్ మరణంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. అతడి మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.