పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ పార్టీ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ను ఎన్నికల సంఘం (ఈసీ) కేటాయించింది. బీహార్ ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపై ఆ పార్టీ పోటీ చేయనున్నది. తరారీ, రామ్‌గఢ్, బెలగంజ్, ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శనివారం గయాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘జన్ సురాజ్’ పార్టీ గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ను ఎందుకు ఎంచుకున్నారో అన్నది వివరించారు.
కాగా, గత 35 ఏళ్లలో ఆర్జేడీ, జేడీయూ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ప్రభుత్వ హయాంలో బీహార్ పిల్లల వెనుక నుంచి స్కూల్ బ్యాగులు తొలగించారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. వారిని బాల కార్మికులుగా చేసి బస్తాలను వారి వీపులకు కట్టారని విమర్శించారు. ‘బీహార్ ప్రజల పేదరికాన్ని అంతం చేసే మార్గం స్కూల్ బ్యాగ్. ఉపాధికి మార్గం స్కూల్ బ్యాగ్. బీహార్‌లో వలసలను ఆపాలంటే స్కూల్ బ్యాగ్ ఒక్కటే మార్గమన్నది జన్ సురాజ్ ఆలోచన. అందుకే ఎన్నికల చిహ్నంగా స్కూల్ బ్యాగ్‌ను జన్ సురాజ్ ఎంచుకున్నది. ఎందుకంటే విద్య ద్వారా మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు. పేదరికాన్ని నిర్మూలించవచ్చు’ అని అన్నారు.
మరోవైపు కులం, ఉచిత రేషన్ ఆధారంగా రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం మానేయాలని బీహార్ ప్రజలను ప్రశాంత్ కిషోర్ కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వెనుకబాటుకు ఈ ఓటింగ్ ప్రవర్తన కారణమని ఆరోపించారు. మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే మీరు ‘జాత్’, ‘భాత్’ కు ఓటు వేయడం మానాలని బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
#WATCH | Gaya, Bihar: On his party’s election symbol ‘school bag’, Jan Suraj Chief Prashant Kishore says”… In the 35 years of Lalu-Nitish rule, the school bag has been removed from the backs of the children of Bihar and a sack of labour has been tied on them. Jan Suraj’s… pic.twitter.com/IpFxlIzW2s
— ANI (@ANI) November 2, 2024