పాట్నా: సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వంపై బీహార్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్ ఆరోపించారు. అందుకే కుర్హానీ ఉప ఎన్నికల్లో జేడీయూ ప్రభుత్వ కూటమి ఓడిందని విమర్శించారు. బీహార్ రాజకీయాల్లో మార్పు కోసం ప్రశాంత్ కుమార్ ఆ రాష్ట్రంలో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో తూర్పు చంపారన్‌లోని మోతిహరి ప్రాంతంలో మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్, ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉప ఎన్నికలో కుర్హానీ అసెంబ్లీ స్థానాన్ని అధికార కూటమి నుంచి బీజేపీ చేజిక్కించుకోవడంపై ఘాటుగా విమర్శించారు.
మహాఘటబంధన్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా లేరని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. కొన్ని రోజులుగా తాను ప్రజలతో మమేకమవుతున్నానని, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన అవినీతి పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. సీఎం నితీశ్ కుమార్‌పై ప్రజల ఆగ్రహానికి కుర్హానీ ఉప ఎన్నిక ఫలితం అద్దం పడుతున్నదని విమర్శించారు.
కాగా, ప్రజల ఆగ్రహం వల్ల కుర్హానీలో ఎన్నికల ప్రచారం కూడా సీఎం నితీశ్ కుమార్ సరిగా నిర్వహించలేదని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు నితీశ్ కుమార్ కుర్హానీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా నిరసనలు వెల్లువెత్తాయని తెలిపారు. నితీశ్ కుమార్ వేదిక వద్దకు చేరుకోగానే, ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు కుర్చీలు కూడా విసిరేశారని గుర్తుచేశారు. ‘ప్రతి చోటా కూడా సీఎంపై ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డులు లేకుండా రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో కూడా ముఖ్యమంత్రి నడవలేరు’ అని మండిపడ్డారు.